మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. జైపుర్ నుంచి సవాయి మాధోపుర్‌కు వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి పట్టాలపై దుండగులు ఏర్పాటు చేసిన అవరోధాలను పైలట్ సకాలంలో గుర్తించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ రైలులో అత్యధికంగా విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
మంగళవారం అర్ధరాత్రి మహరాజా ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణంలో ఉండగా, పట్టాలపై ఏదో అసాధారణ వస్తువులు ఉన్నట్లు లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు సురక్షితంగా ఆగిపోయింది. కిందకు దిగి పరిశీలించగా, పట్టాలపై దాదాపు 5 అడుగుల పొడవున్న భారీ ఇనుప రాడ్లను అడ్డంగా పెట్టినట్లు గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైలును పట్టాలు తప్పించేందుకే దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ రాడ్లను అక్కడ అమర్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం స్నిఫర్ డాగ్స్ సాయంతో రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు, పట్టాల క్లియరెన్స్ కారణంగా రైలు దాదాపు అరగంట పాటు అక్కడే నిలిచిపోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.



