భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోల హతం!

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోల హతం!

మావోయిస్టుల అగ్రదుర్గంగా భావించే ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మట్టుబెట్టాయి.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: మావోయిస్టుల అగ్రదుర్గంగా భావించే ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మట్టుబెట్టాయి. ఇందులో అత్యంత కీలకమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ దా మరణించారు. కాగా, పతిరామ్‌ మాంఝీపై రూ.5 కోట్లు రివార్డు ఉంది. చైబాసా జిల్లా కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన సారండా అడవుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో సీఆర్​పీఎఫ్, రాష్ట్ర భద్రతా దళాలు సంయుక్తంగా 'యాంటీ నక్సల్ ఆపరేషన్' ప్రారంభించాయి. బలగాలు అడవిని చుట్టుముడుతుండగా, మావోయిస్టులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగడంతో గంటల తరబడి కాల్పులు కొనసాగాయి.

అగ్రనేతల వేట.. సారండానే లక్ష్యం
ఝార్ఖండ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి సారండా ప్రాంతమే ప్రధాన అడ్డంకిగా మారింది. సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీతో పాటు రూ.50 లక్షల రివార్డు ఉన్న మరో సీనియర్ కమాండర్ కూడా ఈ కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అడవుల్లో రూ.కోటి రివార్డు ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెసరా నాయకత్వంలో సుమారు 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు.

Read More  Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!!

పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన
"ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల పూర్తి వివరాలు తెలియడానికి సమయం పడుతుంది. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాము. ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తాము" అని కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు.

వరుస ఎన్‌కౌంటర్లతో మావోలు విలవిల
గడిచిన కొద్ది రోజులుగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతమయ్యాయి. జనవరి 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2025లో ఒక్క బస్తర్ డివిజన్‌లోనే దాదాపు 256 మంది మావోయిస్టులు హతమవ్వగా, వందలాది ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.