ట్రంప్ మమ్మల్ని ఫూల్స్ ని చేశాడు..!!

ట్రంప్ మమ్మల్ని ఫూల్స్ ని చేశాడు..!!

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుపై అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.


విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుపై అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు మద్దతు ఇస్తానని, అవసరమైతే సహాయం చేస్తానని చెప్పి చివరకు మాట మార్చారని, తమను నమ్మించి మోసం చేశారని అనేక మంది ఇరానియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన హామీలను విశ్వసించి రోడ్లపైకి వచ్చిన తమను చివరికి ఒంటరిగా వదిలేశారని వారు భావిస్తున్నారు.

మొదట్లో ఇరాన్‌లో ఈ నిరసనలు ఆర్థిక సమస్యల కారణంగా ప్రారంభమయ్యాయి. కరెన్సీ విలువ భారీగా పడిపోవడం, నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజల్లో అసహనం పెరిగింది. ఈ ఆందోళనలు క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. ఆ సమయంలో ట్రంప్ సోషల్ మీడియా ద్వారా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా నిరసన చేపట్టే ప్రజలపై హింస జరిగితే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, త్వరలోనే సహాయం అందుతుందన్న సంకేతాలు కూడా ఇచ్చారు.

Read More డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు

ఈ వ్యాఖ్యలతో చాలామంది నిరసనకారుల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న ఆశ పెరిగింది. అవసరమైతే సైనికంగా అయినా మద్దతు ఇస్తుందనే నమ్మకంతో అనేక మంది పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇరాన్ ప్రభుత్వం ఈ ఉద్యమాలను కఠినంగా అణిచివేసింది. భద్రతా బలగాలు స్నైపర్లు, మెషీన్ గన్లతో కాల్పులు జరిపాయని, వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కథనాలు వెలువడ్డాయి. కొందరు అంచనాల ప్రకారం మరణాల సంఖ్య దాదాపు 15 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు.

ఇంత తీవ్రమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ, ట్రంప్ తన వైఖరిని అకస్మాత్తుగా మార్చుకున్నారు. ఇరాన్ ప్రభుత్వం హింసను ఆపుతామని హామీ ఇచ్చిందని, అమెరికా నుంచి ఎలాంటి సైనిక చర్య ఉండదని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన నిరసనకారుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన తరువాత కూడా, అంతర్జాతీయ మద్దతు వెనక్కి తీసుకున్నట్లు వారికి అనిపించింది.

ఈ పరిణామాలపై పలువురు ఇరానియన్లు TIME పత్రికతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టెహ్రాన్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త మాట్లాడుతూ, “ఈ వేలాది మరణాలకు ట్రంప్ కూడా బాధ్యత వహించాలి. ఆయన చేసిన పోస్టులు చూసే చాలామంది బయటకు వచ్చారు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు “ట్రంప్ మమ్మల్ని రాజకీయ ఆటలో బలిపశువులుగా మార్చాడు. మా కాళ్ల కింద నేలను లాగేశాడు” అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ అధికారులు మాత్రం ఈ నిరసనల వెనుక అమెరికా కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, దాన్ని రెచ్చగొట్టేందుకు విదేశీ శక్తులు ప్రయత్నించాయని వారు చెబుతున్నారు. మొత్తంగా, ఈ సంఘటనల అనంతరం ట్రంప్‌పై ఇరాన్ ప్రజల్లో తీవ్రమైన అపనమ్మకం ఏర్పడింది. ఒకప్పుడు ఆశగా కనిపించిన ఆయన మాటలు, ఇప్పుడు తమకు ద్రోహంగా మారాయని అనేక మంది భావిస్తున్నారు.trump1234

Tags: