మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్

మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్

సాధారణంగా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని కార్పొరేట్ దిగ్గజాలు కోరుకోవడం చూస్తుంటాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దీనికి భిన్నమైన, వినూత్నమైన డిమాండ్ వినిపించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: సాధారణంగా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని కార్పొరేట్ దిగ్గజాలు కోరుకోవడం చూస్తుంటాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దీనికి భిన్నమైన, వినూత్నమైన డిమాండ్ వినిపించింది. "మాపై భారీగా పన్నులు విధించండి" అంటూ 24 దేశాలకు చెందిన సుమారు 400 మంది అత్యంత సంపన్నులు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాము ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నామని..  ఆవిష్కరణలపై పట్టు బిగించామని తెలిపారు. ఇది వ్యవస్థకు మంచిది కాదని.. మార్పు రావాలంటే చట్టసభలు తమపై పన్నుల భారాన్ని పెంచాలని తెలిపారు.

'టైమ్ టు విన్'
సంపన్నులు, సామాన్యుల మధ్య పెరుగుతున్న అగాధాన్ని రూపుమాపాలని కోరుతూ "టైమ్ టు విన్" పేరుతో వీరు సంతకాలు చేసిన లేఖను విడుదల చేశారు. భారీ సంపద కలిగిన కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారని సంపన్నులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపద ప్రభావంతో మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు. తమపై అధిక పన్నులు విధించడం వల్ల తమ జీవన ప్రమాణాలు ఏమాత్రం తగ్గవని.. కానీ, ఆ నిధులతో ఆరోగ్యం, విద్య వంటి ప్రజా సేవలకు భారీగా నిధులు అందుతాయని పేర్కొన్నారు.

Read More నౌకాయానంలో భారత్ ఘనత

అసమానతల అంతానికి అస్త్రం అదే!
ధనవంతులపై 'ప్రగతిశీల సంపద పన్ను'విధించడం ద్వారానే అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తిరిగి నిర్మించుకోగలమని ఈ బృందం స్పష్టం చేసింది. రాజకీయ వ్యవస్థలపై సంపన్నుల గుత్తాధిపత్యాన్ని తగ్గించాలంటే పన్నుల విధానంలో మార్పులు తప్పవని వారు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కూడా ఆదాయ అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ (క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ రచయిత) గతంలోనే భారత్‌లో పెరిగిపోతున్న ఆర్థిక వ్యత్యాసాలపై హెచ్చరించారు. దేశంలోని 'సూపర్ రిచ్' వ్యక్తులపై అదనపు పన్నులు విధించడం ద్వారానే సామాజిక సమతుల్యత సాధ్యమవుతుందని సూచించారు.