కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం
భారత విదేశాంగశాఖ ప్రకటన
విశ్వంభర, నేషనల్ బ్యూరోః గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు.శనివారం సాయంత్రం భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ (Vikram Misri) మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్ డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారు’’ అని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
ఉగ్రవాదంపై రాజీపడేది లేదు: జైశంకర్
ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాక్ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.