డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు
బ్రిటన్‌లోని పౌరులు, శాశ్వత నివాసులకు సంబంధించి వివాదాస్పదంగా మారిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డుల ప్రతిపాదనపై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది.
విశ్వంభర బ్యూరో: బ్రిటన్‌లోని పౌరులు, శాశ్వత నివాసులకు సంబంధించి వివాదాస్పదంగా మారిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డుల ప్రతిపాదనపై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఉద్యోగం పొందాలంటే డిజిటల్ ఐడీ తప్పనిసరి అనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు సమాచారం. దేశంలో అక్రమ వలసలను కట్టడి చేసే లక్ష్యంతో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. బ్రిటన్‌లో ఎవరైనా పనిచేయాలంటే ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ ఐడీ ఉండాల్సిందేనని, ఇది లేకుంటే ఉపాధి లభించదని గతంలో ప్రధాని ప్రకటించారు. ఈ విధానం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రజా వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్
అయితే, ఈ డిజిటల్ కార్డుల విధానంపై బ్రిటన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 30 లక్షల మంది పార్లమెంటరీ పిటిషన్‌పై సంతకాలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన భారీ వ్యతిరేకతను గమనించిన స్టార్మర్ ప్రభుత్వం, ముందడుగు వేయడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.



