కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
విశ్వంభర, ఏపీ బ్యూరో: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది. సుమారు 15 నెలల పాటు, 12 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగిన దర్యాప్తు అనంతరం సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 24 మందిని నిందితులుగా పేర్కొనగా, మరో 12 మంది పాత్రపై విచారణ కొనసాగుతోందని కోర్టుకు వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లను ఈ భారీ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా సిట్ నిర్ధారించింది. ఈ డెయిరీ కనీసం ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండానే, కెమికల్స్, పాల్ ఆయిల్‌ను మిక్స్ చేసి 'సింథటిక్ నెయ్యి'ని తయారు చేసిందని దర్యాప్తులో తేలింది. గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ, ఇతర డెయిరీల పేర్లను అడ్డం పెట్టుకుని టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందం ఈ విచారణను చేపట్టింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మాత్రమే కాకుండా.. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు ఈ కల్తీ నెయ్యి నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని సిట్ తేల్చింది.



