Pawan Kalyan: కులాల చిచ్చు సహించం..!!

Pawan Kalyan:  కులాల చిచ్చు  సహించం..!!

Pawan Kalyan:  తెలుగు లోగిళ్లను వెలుగువాకిళ్లుగా మార్చే పండుగ సంక్రాంతి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మతానికి చెందిన పండుగ కాదని, ప్రకృతిని ఆరాధించే సనాతన సంప్రదాయాల ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని చెప్పారు.

తెలుగు లోగిళ్లను వెలుగువాకిళ్లుగా మార్చే పండుగ సంక్రాంతి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మతానికి చెందిన పండుగ కాదని, ప్రకృతిని ఆరాధించే సనాతన సంప్రదాయాల ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని చెప్పారు. మట్టిని నమ్ముకుని జీవించే ప్రజలందరూ మతాలకు అతీతంగా కలిసి జరుపుకునే పండుగగా సంక్రాంతి మారాలని ఆకాంక్షించారు. కేరళలో ఓనం ఎలా అందరినీ ఏకం చేస్తుందో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి కూడా సమైక్యతకు ప్రతీక కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

పండుగల అసలైన ఆత్మను మర్చిపోకుండా, వాటిలో దాగి ఉన్న శాస్త్రీయత, సంస్కృతి, సంప్రదాయాల్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. సంక్రాంతి పేరుతో కోడిపందాలు, పేకాటలు, జూదాలు ప్రోత్సహించడమే సంస్కృతి కాదని స్పష్టం చేశారు. మన మూలాలను మరిచితే సంస్కృతి దారి తప్పుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకపై సంక్రాంతి అంటే కోట్ల రూపాయలు చేతులు మారే జూదపు కథలు కాకుండా, శ్రమతో జీవించే మనిషి గౌరవం కనిపించాలన్నారు.

Read More వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌

శుక్రవారం ఉదయం పిఠాపురంలో మూడు రోజుల పాటు జరగనున్న పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.186 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, రూ.26 కోట్లతో పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేశారు. పిఠాపురం ఒక పవిత్ర శక్తిపీఠమని, శ్రీపాద శ్రీవల్లభుడి పాదస్పర్శ కలిగిన భూమి అని గుర్తుచేశారు.

తాను రాజకీయాల్లోకి రావడం కానీ, పిఠాపురం నుంచి పోటీ చేయడం కానీ ముందే అనుకున్నది కాదని, అన్నీ దైవ సంకల్పమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ఏడాదిలో రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ ఏడాది మరో రూ.211 కోట్లతో మరిన్ని పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంత విస్తృతంగా అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు.

పిఠాపురంలో చిన్న సంఘటనలకూ అతిశయోక్తి ప్రచారం జరుగుతోందని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు సహించబోమని తీవ్ర హెచ్చరిక చేశారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్న వ్యవస్థ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్టీఆర్ భరోసా కింద 63.50 లక్షల మందికి పెన్షన్లు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, తల్లికి వందనం పథకం ద్వారా కోట్ల మందికి లబ్ధి అందిస్తున్నామని తెలిపారు. మద్యం దోపిడీని అరికట్టి ప్రజల సంక్షేమానికి నిధులు మళ్లించామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలు అందించామని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ మొదలైందని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశ్రమలు, మత్స్యకార అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, దేవాలయాల అభివృద్ధి వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా సంక్రాంతి వేడుకలు మాత్రమే కాదు, పిఠాపురం భవిష్యత్తునే మార్చే అభివృద్ధి సంకల్పానికి ఈ రోజు ఆరంభమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

 

Tags: