సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారం ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్
విశ్వంభర, పటాన్‌చెరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సవాల్ విసిరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాళా ప్రభుత్వాన్ని నడుపుతోందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.కేసీఆర్ పాలనలో తాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు లేవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కరెంట్ కష్టాలు, నీటి కోసం ప్రజలు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.కేసీఆర్ కంటే మెరుగ్గా పని చేసి పేరు తెచ్చుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు రెండేళ్లుగా నరకం చూస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను కాపాడిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ పథకాలను బంద్ పెట్టడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారని, వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం అందించలేదని హరీశ్ రావు ఆరోపించారు.మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించి, ఆ మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కోటి రూపాయల పరిహారం అందిస్తే తాను వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టంగా సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓటర్లు నమ్మొద్దని హితవు పలికారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి ప్రజల పక్షాన నిలబడే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.



