Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు

Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు


విశ్వంభర ఏపీ, బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికత ఎలా పుట్టిందో, ప్రపంచంలోని గొప్ప నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రపంచ ప్రఖ్యాత నగరాలన్నీ నదీ తీరాల వెంబడే రూపుదిద్దుకున్నాయని ఆయన గుర్తు చేశారు.

శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న చంద్రబాబు, రాజధాని మరియు నీటి వనరుల అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. నదీ గర్భం అంటే ఏమిటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏమిటి అనే కనీస అవగాహన లేకుండానే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, రాజధాని అంశంలో ఇప్పటికీ విషప్రచారం మానడం లేదని విమర్శించారు.

Read More గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు ఉక్కుపాదం 

నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో కలిసి సమన్వయంగా పనిచేసి మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పరస్పర సహకారమే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

నీటిని సమర్థంగా వినియోగించుకోవడం వల్లే రాయలసీమ ముఖచిత్రం మారిందని చంద్రబాబు గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమలో ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా అడ్డుకుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు పెట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.

రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నీరు కీలకమని, నదులపై అవగాహనతో కూడిన విధానాలే రాష్ట్ర భవిష్యత్తును మార్చగలవని ఆయన స్పష్టం చేశారు.