14 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

14 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా  ఏర్పాట్లు
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

విశ్వంభర,  హనుమకొండ: హనుమకొండ జిల్లా లోని కాకతీయ వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 14 నుండి 18 వరకు మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వేయి స్తంభాల దేవాలయంలో  మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చౌహత్ వాజ్పేయి , ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, ఆలయ ఈవో అనిల్ కుమార్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు దర్శనాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ,  ఈనెల 14 శనివారం ఉదయం నాలుగున్నర నుండి కార్యక్రమాలు ప్రారంభమై 18 సాయంత్రం 5 గంటలకు జరిగే పూర్ణహుతి, మహా పుష్పార్చనలతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల విజయవంతనికి అందరూ సహకరించాలని కోరారు.

Tags: