శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ ధమాకా!
భక్తుల కోసం వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు
On
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. శివయ్య దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ప్రయాణికుల కోసం ఏకంగా 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
విశ్వంభర,తెలంగాణ బ్యూరో: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. శివయ్య దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ప్రయాణికుల కోసం ఏకంగా 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ స్పెషల్ ఆపరేషన్ కొనసాగనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 208 బస్సులను కేటాయించడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అసౌకర్యం కలగకుండా సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి ఉన్నతాధికారులతో కలిసి భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం నుంచి కీసర దాకా..
రాష్ట్రంలోని 43 ప్రధాన శైవక్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని మల్లికార్జున స్వామి సన్నిధి (శ్రీశైలం)కి వెళ్లే భక్తుల కోసం అత్యధికంగా 781 బస్సులను కేటాయించారు. అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు 416, మెదక్ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలకు 249, హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్టకు 326 బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని కొమురవెల్లి, కాళేశ్వరం, రామప్ప, ఉమామహేశ్వరం వంటి ఆలయాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నిరంతరం నడవనున్నాయి.
మహిళలకు శుభవార్త..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఈ ప్రత్యేక బస్సుల్లోనూ వర్తించనుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు తమ ప్రాంతం నుంచి శైవక్షేత్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ప్రయాణ సమయంలో మహిళలు విధిగా ‘జీరో టికెట్’ తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. దూరప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం శ్రీశైలం బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను ముందే బుక్ చేసుకోవచ్చు.
చార్జీల సవరణ.. స్పెషల్ సర్వీసులకు మాత్రమే
ప్రభుత్వ జీవో ప్రకారం, పండుగ రద్దీని తట్టుకునేందుకు నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలను కొంతమేర సవరించారు. రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ చార్జీలే ఉండగా, ఈ మూడు రోజులు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రం 1.5 రెట్లు (ఒకటిన్నర రెట్లు)అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. ఏడుపాయల జాతర దృష్ట్యా అక్కడికి వెళ్లే బస్సుల్లో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. భక్తులకు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు 040-69440000, 040-23450033 కాల్ సెంటర్ నంబర్లను నిరంతరం అందుబాటులో ఉంచారు.
క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా..
ప్రతి బస్సు ముందు భాగంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. అవసరమైతే మరిన్ని బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని రీజినల్ మేనేజర్లకు ఎండీ నాగిరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Tags: RTC BUS



