మున్సిపల్ పోరు.. ఎస్‌ఈసీ కార్యాలయంలో సీఈఓ భేటీ

లైవ్ మానిటరింగ్‌లో పోలింగ్ సరళి పరిశీలన

మున్సిపల్ పోరు.. ఎస్‌ఈసీ కార్యాలయంలో సీఈఓ భేటీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ తీరును అధికార యంత్రాంగం పర్యవేక్షించింది. పోలింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా, పారదర్శకతతో కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో ఎస్‌ఈసీ రాణి కుముదినితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల సరళి, ఎదురైన సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు.
 
ప్రతి అడుగుపై నిఘా..100 శాతం వెబ్ కాస్టింగ్! 
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దీని ద్వారా పోలింగ్ కేంద్రం లోపల జరిగే ప్రతి కదలికను ఉన్నతాధికారులు నిరంతరం గమనించారు. ఈ వ్యవస్థ పనితీరును సీఈఓ సుదర్శన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల ద్వారా వివిధ జిల్లాల్లోని పోలింగ్ సరళిని ఆయన లైవ్‌లో వీక్షించారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ల నుంచి సమాచారం ఎంత వేగంగా అందుతోంది? ఏవైనా సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్నాయా? అనే అంశాలపై రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు.
 
అక్రమాలకు ఇక తావులేదు.. 
వెబ్ కాస్టింగ్ వినియోగం వల్ల ఎన్నికల ప్రక్రియలో అత్యంత పారదర్శకత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో రిగ్గింగ్, దొంగ ఓట్లు, అసాంఘిక శక్తుల ప్రవేశం వంటి అక్రమాలను ఈ నిఘా కళ్లతో సమర్థవంతంగా అడ్డుకోవచ్చని సీఈఓ పేర్కొన్నారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతతో పాటు, టెక్నాలజీని జోడించడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.
 
రాబోయే ఎన్నికలపై కసరత్తు 
కేవలం మున్సిపల్ ఎన్నికలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఈ భేటీలో ముందస్తు ప్రణాళికలు రచించారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు, క్షేత్రస్థాయి ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల గణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం, కోర్టు ఆదేశాలకు లోబడి నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఎస్‌ఈసీ దృష్టి సారించింది. ఈ సమావేశం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఫలితాల అనంతరం స్థానిక పోరుకు లైన్ క్లియర్ చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags: elections