యూరియా యాప్ తో రైతుల తిప్పలు
విశ్వంభర, రామన్నపేట: రైతులకు యూరియా యాప్ తో తిప్పలే తిప్పలు. ఈ యాపు వాడాలి అంటే స్మార్టు ఫోను ఉండాలి, దానిని ఆపరేటు చేయడం తెలిసి ఉండాలి, చదువు రాని, ఎలా ఆపరేట్ చేయాలో తెలియని రైతుల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ అన్నదాతల కష్టాలు తీర్చకపోగా రైతన్నలను మరింత అయోమయంలోనికి పడేస్తోంది. దళారుల వ్యాపారానికి అడ్డుకట్ట వేసి రైతులకు అందరికీ అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ఆశయం రైతన్నలకు అందని ద్రాక్షగానే మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతన్నలకు కొత్త యూరియా యాప్ లో యూరియా బుకింగ్ చేసే అవగాహన లేక ఎవరిని సంప్రదించాలో తెలియక ఒకవైపు పైరును, మరొకవైపు ఎరువుల దుకాణాల వైపు దిగాలుపడి చూస్తున్న వైనం. దీనిని ప్రభుత్వం గుర్తించి రైతులకు సౌలభ్యకరంగా తగు ఏర్పాట్లు చేయాలని, మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను తీసుకుని రైతులకు గ్రామాల వారీగా అవగాహన కల్పించి అందరు రైతులకు యూరియాను అందించాలని మండలంలోని అన్ని గ్రామాల రైతులు కోరుతున్నారు.



