అదనపు కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం
విశ్వంభర, చింతపల్లి: అదనపు కట్నం వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని హోమంతాలపల్లి గ్రామానికి చెందిన జబ్బు శిరీష(26), ఆమె భర్త శ్రీనయ్య యాదవ్ అదే గ్రామంలో నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శిరీషను వేధిస్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన జబ్బు శిరీష సోమవారం తనతోపాటు ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. భారీగా మంటలు వ్యాపించాయ్. ఇంట్లో నుండి కేకలు వినిపించాయి. వెంటనే స్థానికులు ఇంట్లోకి ప్రవేశించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శిరీషను, పిల్లలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిరీష పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. బాధితురాలి తండ్రి గొడ్డటి లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంమూర్తి తెలిపారు.



