భద్రాచలంలో ఘనంగా మాఘ పౌర్ణమి
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సహస్ర కలశాభిషేకం
విశ్వంభర, భద్రాచలం : మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘ మాస పౌర్ణమి రోజున నిర్వహించే ఈ విశేష పూజా కార్యక్రమం భక్తుల మనసులను భక్తిరసంతో నింపుతూ విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి వివిధ ఘాట్‌ల వద్ద నుంచి నదీజలాలను శ్రద్ధాభక్తులతో సేకరించి, పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలు, ఔషధ ద్రవ్యాలతో కలిపి వెయ్యి కలశాలలో నింపారు. కలశాలను ఒక క్రమ పద్ధతిలో ఆలయ ప్రాంగణంలో పేర్చి, హోమశాలలో వేద పండితులచే ప్రత్యేక హోమాలు, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ రోజు ఉదయం ప్రధాన ఆలయం నుంచి సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిని మంగళ వాయిద్యాల నడుమ బేడ మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య సహస్ర కలశాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అభిషేక సమయంలో ఆలయ ప్రాంగణమంతా “జై శ్రీరామ్” నామస్మరణతో మార్మోగి భక్తుల హృదయాలు పరవశించాయి. అనంతరం మహా కుంభాన్ని మూలవర్ల వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మహా కుంభంతో స్వామి వారికి అభిషేకం చేయగా, ఆ దృశ్యం భక్తులను ఆధ్యాత్మికంగా మంత్ర ముగ్ధులను చేసింది. సహస్ర కలశాభిషేకం అనంతరం ఆలయంలో విశేష పూజలు, మంగళ హారతులు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ అధికారులు, అర్చక స్వాములు, వేద పండితులు, స్థానికులు మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహోత్సవాన్ని తిలకించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ సహస్ర కలశాభిషేకం భద్రాచలం క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా మార్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.



