చారిత్రక ఘట్టం వైపు అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది.
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. తొలుత కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించనున్నారు.
విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 జూన్ 2తో హైదరాబాద్‌పై ఏపీకి ఉన్న హక్కుల గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో తమ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. జూన్ 2, 2024 నుంచే అమరావతిని రాజధానిగా పరిగణించాలని రాష్ట్రం కోరగా, కేంద్రం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించింది.
కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలను సేకరించిన హోంశాఖ.. పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖల తుది నివేదికల కోసం వేచి చూస్తోంది. ఈ బిల్లు రూపకల్పనలో నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. అన్ని శాఖల నుంచి సానుకూల నివేదికలు అందగానే, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు హోంశాఖ తుది నోట్‌ను సిద్ధం చేయనుంది.
ఏపీ ప్రభుత్వ నోట్ కీలకం
అమరావతిలో ఇప్పటికే జరిగిన నిర్మాణ పనులు, రాజధాని ఎంపిక ప్రక్రియ, రైతుల భూసేకరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లోతైన వివరాలు కేంద్రానికి కీలక ఆధారాలుగా మారాయి. కేంద్ర గుర్తింపు లభిస్తే, అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు, కేంద్ర గ్రాంట్ల రాక మరింత సులభం కానుంది. కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదిస్తే, ఇకపై అమరావతికి ఎదురుండదని రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధమైన రాజధానిగా అమరావతికి ముద్ర పడితే, ఏపీ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.



