మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు ధన్యవాదాలు

మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు ధన్యవాదాలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు పెంచి, నూతన భవనం నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు అని, ఆసుపత్రి సాధన కోసం జరిగే భవిష్యత్తు పోరాటంలో ఇదే రకంగా రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని, ప్రజారోగ్యం కోసం పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తెలిపారు. గత దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, వంద పడకలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం మూడు రోజులపాటు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు మద్దతు ఇచ్చాయని, సిపిఎం నిరవధిక నిరాహార దీక్షల జయప్రదం కోసం కృషి చేశాయని తెలిపారు. నిరవధిక నిరాహార దీక్షలకు స్పందించిన రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, స్థానిక శాసన సభ్యులు వేముల వీరేశం చొరవతో స్థానిక ఆర్డిఓ శేఖర్ రెడ్డి దీక్షాశిబిరం వద్దకు వచ్చి ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని, వంద పడకల ఆసుపత్రి కోసం కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారని, తనకు స్వయంగా శాసన సభ్యులు ఫోన్ చేసి చెప్పారని చెప్పడంతో దీక్షలు విరమింప చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు, మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాగటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

Tags: