ఫ్యూచర్ సిటీకి 'ఏఐ' కళ

ఫ్యూచర్ సిటీకి 'ఏఐ' కళ

తెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

విశ్వంభర బ్యూరో: తెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముచ్చర్లలో నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'యూపీసీ వోల్ట్' (UPC Volt) ముందుకొచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సందర్భంగా యూపీసీ వోల్ట్ సీఈవో హాన్‌ డీ గ్రూట్‌, కో-ఫౌండర్ స్టీవెన్ జ్వాన్, ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌లతో కూడిన ప్రతినిధి బృందం గురువారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో సమావేశమైంది. ఈ సందర్భంగా డేటా సెంటర్ స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.

ప్రాజెక్టు విశేషాలివే..
ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ సాంకేతికతకు అనుకూలమైన డేటా సెంటర్‌ను నెలకొల్పుతారు. వచ్చే ఐదేళ్ల కాలంలో విడతల వారీగా రూ.5,000 కోట్లు వెచ్చించనున్నారు. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్‌ను కూడా సంస్థే ఏర్పాటు చేయనుంది. నిర్మాణ దశలోనే సుమారు 3,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరో 800 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

Read More ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు

టెక్ సెంటర్‌గా ఫ్యూచర్ సిటీ
ఈ ఒప్పందంపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. "ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి ఈ పెట్టుబడి ఒక నిదర్శనం. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణ హితమైన విద్యుత్ వినియోగం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత" అని పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఈ పెట్టుబడి ద్వారా మరోసారి నిరూపితమైందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.