మీడియానే టార్గెట్? నేతల స్కాంలపై సిట్ ఎక్కడ?: కేటీఆర్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకే కమిషన్లు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మీడియా కథనాలను ఉటంకించిన కారణంతోనే కొన్ని మీడియా సంస్థలపై సిట్ ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో, తమ సొంత పార్టీ నేతలపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక ఘటనలను కేటీఆర్ తన ప్రకటనగా ప్రస్తావించారు. ఒక మంత్రి పీఏ, ముఖ్యమంత్రి సన్నిహితుడితో కలిసి ఓ పారిశ్రామికవేత్తను బెదిరించి రూ.300 కోట్ల డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎందుకు సిట్ లేదని ప్రశ్నించారు. అలాగే, ములుగు జిల్లాలో మంత్రి పీఏ ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలపై కూడా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. రెవెన్యూ మంత్రి కుమారుడు వందల కోట్ల భూకబ్జాకు పాల్పడ్డాడన్న కేసులో, ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారినే బదిలీ చేయడం గానీ, అసలు భూకబ్జాపై విచారణ ఎందుకు జరగలేదని నిలదీశారు.
ఇంతకుమించి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్‌ను రూ.8 కోట్ల కోసం బెదిరించారన్న ఆరోపణలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల బంకర్ బెడ్స్ కొనుగోలులో సుమారు రూ.100 కోట్ల అవినీతి, లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ వివాదం, నాసిరకం మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు వంటి అంశాలపై ప్రభుత్వం ఎందుకు సిట్ ఏర్పాటు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. యూనివర్సిటీ భూముల అమ్మకాల్లో భారీ మోసం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చినా, విచారణకు వెనుకడుగు వేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటని ఆయన నిలదీశారు.
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్తను ఇతర మీడియా సంస్థలు కేవలం ఉటంకించినందుకే, వాటిపై సిట్ వేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు కథనం ఇచ్చిన వారిని వదిలేసి, ప్రశ్నించే మీడియాపైనే చర్యలు చేపట్టడం వెనుక ఎవరిని కాపాడాలన్న ఉద్దేశం, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నాలు కొనసాగితే, ప్రజలు తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ హెచ్చరించారు.



