ములుగు జిల్లాను తొలగింపు.. సీతక్క ఏమన్నారంటే..!!

ములుగు జిల్లాను తొలగింపు.. సీతక్క ఏమన్నారంటే..!!

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలను రద్దు చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే జనగామ జిల్లా తొలగింపుపై జరిగిన ప్రచారాన్ని అక్కడి ప్రజాప్రతినిధులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా ములుగు జిల్లాను రద్దు చేయబోతున్నారనే వార్తలు రావడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క స్పష్టమైన స్పందన ఇచ్చారు.

ములుగు జిల్లా కొనసాగింపుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. జిల్లాను తొలగిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె తేల్చి చెప్పారు. కొంతమంది కావాలనే తప్పుడు సమాచారం పంచుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నిరాధార వార్తలు ప్రచారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అపప్రద చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

Read More Hydra: రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమిని రక్షించిన హైడ్రా..!!

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ఆ సందర్భంలో భవిష్యత్తులో అవసరమైతే పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు ఉండొచ్చని మాత్రమే ఆయన ప్రస్తావించారని వివరించారు. దీన్ని జిల్లాల రద్దుగా ప్రచారం చేయడం సరికాదన్నారు.

ములుగు జిల్లా అనేది ఎంతో మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిందని మంత్రి గుర్తు చేశారు. జిల్లాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె కోరారు. ములుగు జిల్లా భవిష్యత్తు భద్రమేనని, అభివృద్ధి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.Seethakka Speech

Tags: