Uttam Kumar Reddy: కృష్ణా నీటిపై ఒక్క చుక్క కూడా వదులుకోం.. మంత్రి ఉత్తమ్..!!

Uttam Kumar Reddy: కృష్ణా నీటిపై ఒక్క చుక్క కూడా వదులుకోం.. మంత్రి ఉత్తమ్..!!

Uttam Kumar Reddy: కృష్ణా నది నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Uttam Kumar Reddy: కృష్ణా నది నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి, నీటిపారుదల పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు చివరి వరకూ పోరాడతామని తేల్చిచెప్పారు.

Read More అంకుసాపూర్, ఇంద్రనగర్‌లో సొంత ఖర్చుతో కొత్త మోటారు ఏర్పాటు చేసిన 3వ వార్డ్ మెంబర్  సుకన్య మధుసూదన్ రెడ్డి

 

గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి విమర్శించారు. అప్పట్లో కేవలం 34 శాతం నీటికి అంగీకరించడం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా సాధించాలనే లక్ష్యంతో పోరాటం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

 

గత పదేళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినా, కృష్ణా నదిపై చేపట్టిన కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని, వచ్చే మూడేళ్లలో కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.

 

తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి స్పష్టంచేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నదీ ట్రిబ్యునల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో రెడ్లకుంట, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై చెక్‌డ్యామ్, పాలవరం లిఫ్ట్ ఇరిగేషన్, నడిగూడెం చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్‌పై డబుల్ బ్రిడ్జి, పాలే అన్నారం బ్రిడ్జి పనులు ఎండాకాలం చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.