టైమ్ స్కేల్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
On
విశ్వంభర, ముషీరాబాదు : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు రవి, గౌరవాధ్యక్షుడు జె. వెంకటేష్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పది సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ ఉద్యోగులను దశలవారీగా టైమ్ స్కేల్‌లోకి తీసుకురావాలని, వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్లే సెలవులన్నీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. ధర్నాను ప్రారంభించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ మాట్లాడుతూ, యూనివర్సిటీల నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టైమ్ స్కేల్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని, గ్రాట్యుటీగా రూ.20 లక్షలు చెల్లించాలని కోరారు. సేవలో ఉండగానే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ నాయకులు చిరంజీవి, దేశిన రవికుమార్, శాతవాహన యూనివర్సిటీ నాయకులు ముల్కల దేవేందర్, ఎం. శ్రీనివాస్, ఓయూ నాయకులు ఎం. దశరథ్ తదితరులు పాల్గొన్నారు.



