అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు
On
విశ్వంభర, చింతపల్లి : అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చింతపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎల్లంకి అశోక్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసానికి గురి చేస్తున్న రేవంత్ సర్కార్ మెడలు వంచే దిశగా చలో అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం మంగళవారం పిలుపునివ్వడంతో మంగళవారం తెల్లవారుజామున ముందస్తుగా చింతపల్లి పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల వద్దకు చేరుకొని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎల్లంకి అశోక్ మాట్లాడుతూ లాటీలు తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దిశగా పోరాటం చేస్తామని ఎన్ని కేసులు అయినా ఎన్ని అరెస్టులైన ఈ ధర్మపోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో విద్యారంగానికి తొలి ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు ఆరెకంటి మురళీ, మైనార్టీ నాయకులు ఎండీ.ఖాలేద్, ఎండీ.జాఫర్, మాసని పెద్దయ్య, సిద్దే స్వామి, ఊరే భాస్కర్, ఆదిమల్ల అశోక్ తదితరులు ఉన్నారు.



