రమణ మహర్షి స్ఫూర్తి సమాజానికి మార్గదర్శకం  

రమణ మహర్షి స్ఫూర్తి సమాజానికి మార్గదర్శకం  

  •  డాక్టర్ కె.వి. రమణ 

విశ్వంభర, చిక్కడపల్లి : ఉన్నత స్థాయిలో ఉండి నిరాడంబర జీవితం గడుపుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచే వారు చాలా అరుదు అని ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణ అన్నారు. సాధారణ జీవితం గడిపినా అసామాన్య వ్యక్తిత్వంతో ప్రజల ఆరాధనకు పాత్రుడైన రమణ మహర్షి స్ఫూర్తి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో  కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మద్దాలి సుబ్బారావు రచించిన “భగవాన్ సన్నిధిలో కృపామయ క్షణాలు” ఆంగ్ల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ గ్రంథాన్ని విడుదల చేసి మాట్లాడారు. అరుణాచలం లోని రమణ మహర్షి ఆశ్రమంలో గడిపిన అనుభవాలను సుబ్బారావు రచనగా అందించగా, ఆయన కుమారుడు రఘురామ్ ప్రచురించి సమాజానికి అందిస్తున్నట్లు అభినందించారు. తండ్రి శతజయంతి వేడుకలను నిర్వహిస్తూ “పితృదేవో భవ” అన్న ఆర్య సూక్తిని ఆచరణలో చూపుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ, మౌన ఋషిగా ప్రసిద్ధి చెందిన రమణ మహర్షి ఆచరణ ద్వారానే భక్తులకు సందేశం ఇచ్చిన మహనీయుడని వివరించారు. ఈ సందర్భంగా నీల్ కమల్ ప్రచురణ సంస్థ అధినేత శరత్ వంద గ్రంథాలు కొనుగోలు చేశారు. ప్రముఖ నవలా రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ రమణ మహర్షి జీవితం, తత్త్వంపై ప్రసంగించారు. కిన్నెర రఘురామ్ స్వాగతం పలుకుతూ సుబ్బారావు రచించిన 15 గ్రంథాలను ఇప్పటికే ప్రచురించిన విషయాన్ని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయ పన్నుల శాఖ విశ్రాంత ప్రధాన సంచాలకుడు రాయసం వెంకట రామ తదితరులు పాల్గొన్నారు.

Tags: