పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్స్ సమస్యలు పరిష్కరించాలి
On
విశ్వంభర, ముషీరాబాదు : పోర్టర్ యాప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్ పార్ట్నర్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మంగళవారం ఎఐఆర్టీడబ్ల్యూఎఫ్ (సిఐటియు) పోర్టర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ యాప్‌ల ద్వారా సేవలు బుక్ చేసుకునే విధానం పెరిగిన నేపథ్యంలో మేనేజ్మెంట్లు దీనిని అవకాశంగా తీసుకుని డ్రైవర్లకు తగిన రేట్లు ఇవ్వకుండా, కమిషన్లు పెంచి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. గిగ్ మరియు ప్లాట్‌ఫారం వర్కర్ల సంక్షేమానికి చట్టం చేసినప్పటికీ, దానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వెంటనే రూల్స్ రూపొందించి అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. పోర్టర్ సంస్థ డ్రైవర్లను పార్ట్నర్స్‌గా పేర్కొంటూ కమిషన్ వసూలు చేస్తోందని, అయితే పార్ట్నర్ అనే పేరుకు తగ్గట్టు లాభాల్లో వాటా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీక్షలో పాల్గొంటున్న ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని, ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారంలో పోర్టర్ మేనేజ్మెంట్ స్పందించకపోతే ఏప్రిల్ 6న చేపట్టే సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది డ్రైవర్లు సర్వీస్ పార్ట్నర్స్‌గా పనిచేస్తుండగా, 12 నుండి 19 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నారని తెలిపారు. చిన్న కారణాలతో సస్పెన్షన్లు విధించడం, ప్రమాదాలు జరిగినా సహాయం అందించకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ల మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన రూ.5 లక్షల ప్రమాద బీమా కూడా అందించడం లేదని విమర్శించారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత టారిఫ్ రేట్లను పెంచాలని, డ్రైవర్లతో సంప్రదింపుల తర్వాతే ఛార్జీలను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కమిషన్‌ను 5 నుండి 8 శాతం తగ్గించాలని, అన్ని సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరారు. డ్రైవర్లకు ఆర్డర్‌లను రద్దు చేసే హక్కు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె అజయ్ బాబు అధ్యక్షత వహించగా, బి మహేష్, సయ్యద్ మునీర్ తదితరులు మాట్లాడారు. దీక్షలో కే సతీష్, శ్రీకాంత్ రెడ్డి, ఏడుకొండలు, పి దేవా, లక్ష్మీకాంత్ రెడ్డి, హరిదాస్, రామాంజనేయులు, నారాయణస్వామి, నాగేష్ బాబు, ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు.



