టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టాలి
On
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ప్రపంచ క్షయ వ్యాధి నిర్ములన దినోత్సవం సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ములన పై గాంధీ పార్క్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు.. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ, సామాజిక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్నీ పరికరాలు, పూర్తి స్థాయి చికిత్స తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.20 లక్షల వ్యయంతో మొబైల్ ఎక్స్ రే మిషన్ కొనుగోలు చేసి వాటి ద్వారా జనవరి 2025నుండి జిల్లా వ్యాప్తంగా 52, 901 మందికి టీబీ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని వీరిలో 1741 మందికి రోగ నిర్ధారణ కాగా 1356 మందికి చికిత్స పూర్తి అయిందని ప్రస్తుతం 385మందికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. 21 గ్రామ పంచాయితీలను టీబీ ముక్తి గ్రామ పంచాయితీలుగా గుర్తించడం జరిగిందని జిల్లాలో కొత్త కేసులు నమోదవకుండా 21 నుండి 100 టిబి ముక్తి జిపిలుగా, టిబి ముక్తి మండలాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు టిబి వారియర్ లుగా కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో అవగాహన, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి లక్ష్య సాధన చేరిన పిహెచ్సీ లకు రూ.లక్ష ప్రోత్సాహకాన్ని, జిల్లాలోని మూడు టీబీ యూనిట్ల అభివృద్ధి కొరకై రూ.3లక్షల చొప్పున కలెక్టర్ ప్రకటించారు. అనంతరం టిబి ముక్తి జీపీలుగా తీర్చిదిద్దిన సర్పంచులను, గ్రామ కార్యదర్శులను, వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, ప్రస్తుత ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్, డాక్టర్ నాజియా తబస్సుమ్, హెచ్వొడిలు డాక్టర్ గురు రాజు, డాక్టర్ ఈశ్వరమ్మ, డాక్టర్ శ్రీకాంత్ భట్, డాక్టర్ జనార్ధన్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకట పాపిరెడ్డి, డిప్యూటీ డియంహెచ్ఓలు డాక్టర్ జి చంద్రశేఖర్, డాక్టర్ మాధవ్ కుమార్, ఆర్డిఓ వేణు మాధవ్, వైద్యాధికారులు, ఇతర వైద్య సిబ్బంది. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.



