ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుస్తక సమీక్ష
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన "డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం-సమాలోచనం" పుస్తక సమీక్షా కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గొప్ప సాహితీవేత్తయని, తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారని, మహాకవి దాశరథి పురస్కారమే కాకుండా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న మహనీయుడని, అటువంటి వారి సాహిత్యం మీద సమగ్రంగా జాతీయ సదస్సు నిర్వహించడమే కాకుండా పుస్తకంగా తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ పుస్తక సంపాదకులు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, జాతీయ సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేసిన 31 మంది ఆచార్యుల, పరిశోధక విద్యార్థుల వ్యాసాలను పుస్తక రూపంగా తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ పుస్తకాన్ని మూసీ ప్రత్యేక సంచికగా వెలువరించిన ఆ పత్రిక నిర్వాహకులు ఆచార్య సాగి కమలాకర్ శర్మకు, ప్రచురించిన కూరెళ్ల ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వర రావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



