గుమ్మడిదలలో కలెక్టర్ విస్తృత పర్యటన 

గుమ్మడిదలలో కలెక్టర్ విస్తృత పర్యటన 

విశ్వంభర, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం గుమ్మడిదల మండలంలో  విస్తృతంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియను పరిశీలించడంతో పాటు నల్లవల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాన్ని సందర్శించి లబ్ధిదారుతో మాట్లాడారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  ముందుగా గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించి అక్కడి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రోగుల ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరచడం ద్వారా వైద్య సేవలు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించవచ్చని తెలిపారు. నెట్‌వర్క్, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీసి, అవసరమైన అన్ని ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదనంతరం నల్లవల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాన్ని సందర్శించిన కలెక్టర్, లబ్ధిదారుతో మాట్లాడి ఇంటి నిర్మాణ నాణ్యత, అందుబాటులో ఉన్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరిగాయా అని ఆరా తీసి, ఇల్లు చక్కగా నిర్మించు కున్నందుకు లబ్ధిదారును అభినందించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవిత ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. పిమ్మట గుమ్మడిదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి,  సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై తహసిల్దార్‌తో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో తహసిల్దార్ పరమేశ్వర్, నల్లవల్లి సర్పంచ్ రాణి సురేష్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: