గుడిసెవాసులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
On
విశ్వంభర, ముషీరాబాదు : ప్రభుత్వ, భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. గుడిసెలను తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించింది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో నేతలు మాట్లాడుతూ, నిరుపేదలకు పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. గుడిసెలవాసుల నినాదాలతో ధర్నా చౌక్ మార్మోగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పేదలకు భూమి దక్కేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ప్రభుత్వం పేదల గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇటి నరసింహా, నెల్లికంటి సత్యం, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



