రహదారి పనులు పూర్తి చేయాలని రాస్తారోకో
విశ్వంభర, బచ్చన్నపేట: మండల కేంద్రంలో నిలిచిపోయిన రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్థులు బచ్చన్నపేట చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి కొడవటూరు కమాన్ వరకు రోడ్డు అధ్వాన్నంగా తయారవ్వడంతో, గ్రామస్థులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రహదారి పనులు మధ్యలోనే ఆగిపోయాయని గ్రామస్థులు మండిపడ్డారు. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల వల్ల నిత్యం ప్రయాణికులు పడిపోయి గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి రోడ్డు నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. నిరసన సమాచారం అందుకున్న నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చలు జరిపారు.నేషనల్ హైవే డివిజనల్ ఇంజనీర్ రవీందర్ తో పోలీసులు ఫోన్‌లో మాట్లాడారు. 15 రోజుల్లో తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమం లో పలుపార్టీల నాయకులు పాల్గొన్నారు.



