పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాషకు ప్రాధాన్యం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ సీహెచ్. శ్యాంసుందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భాషయైన ఆంగ్లం ప్రాధాన్యత సమాజంలో ఎంతో ఉన్నదని, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాషకు తగిన ప్రాధాన్యత ఉన్నదని అన్నారు. ఆంగ్లభాష నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉన్నదని అన్నారు. గ్రూప్ చర్చలతో పాటు ఇంటర్వ్యూకు సంబంధించిన మెలకువలను విద్యార్థులకు అవగాహన కలిగించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ ఆంగ్ల భాష నైపుణ్యం కలిగి ఉంటే తప్పకుండా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుందని, ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధిని పొందే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగ అధిపతి డాక్టర్ ఎం.లక్ష్మీ నీలిమ, అధ్యాపకురాలు రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.



