రైలులో మద్యం పట్టివేత
- 70 బాటిళ్లు స్వాధీనం
విశ్వంభర, హైదరాబాదు: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏపీ సంపర్క్ క్రాంతి రైల్లో నిర్వహించిన తనిఖీల్లో ఢిల్లీకి చెందిన డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మొత్తం రూ.1.40 లక్షల విలువ చేసే 70 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, శివ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఏపీకి చెందిన శివ మద్యం బాటిళ్లను హైదరాబాదుకు తీసుకొస్తున్నాడనే సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బంది, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్ పోలీసులు కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నిందితుడి వద్ద 70 ఢిల్లీ డిఫెన్స్ మద్యం బాటిళ్లు లభించాయి. వీటిలో బెండర్ స్పెషల్ 23 బాటిళ్లు, సిగ్నేచర్ 11 బాటిళ్లు, రాయల్ చాలెంజ్ 12 బాటిళ్లు, ఓల్డ్ మంక్ రమ్ 24 బాటిళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.40 లక్షలుగా అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు, నిందితుడు శివను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ బిక్షారెడ్డి వెల్లడించారు.



