పారదర్శక పాలన అందించాలి
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
విశ్వంభర,నిజామాబాద్: కామారెడ్డి పట్టణ ప్రజలకు పారదర్శక పాలన అందించాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతన ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీలో లక్షకు పైగా ఓటర్లు పెరిగారని, రాబోయే ఐదేళ్లలో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుందన్నారు. కామారెడ్డి ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకువెళ్తూ కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఛైర్ పర్సన్‌కు సూచించారు. వచ్చే వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కామారెడ్డికి ఎలాంటి నిధులు కొరత లేకుండా సీఎంతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున నిధులకు కొరత లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.



