సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ మారదు: హైడ్రా

విశ్వంభర, మాదాపూర్‌ :  మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) హద్దులు ఎట్టి పరిస్థితుల్లో మారవని హైడ్రా స్పష్టం చేసింది. 2014 మేలో ఇరిగేషన్ శాఖ నిర్ధారించిన హద్దుల మేరకే ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించింది. ఎఫ్‌టీఎల్ హద్దులు మార్చి చెరువు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ పనులు చేస్తున్నారన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలను హైడ్రా ఖండించింది. “జియో కోఆర్డినేట్స్ ఆధారంగా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమక్షంలోనే హద్దులు ఖరారు చేశాం. ఎలాంటి మార్పులు చేయలేదు” అని స్పష్టం చేసింది. కబ్జాల కారణంగా 14 ఎకరాలకు తగ్గిన చెరువును 2014లో నిర్ధారించిన మేరకు 31 ఎకరాలకు పునరుద్ధరించినట్లు తెలిపింది. “ఎఫ్‌టీఎల్ హద్దులు శాశ్వతం. వాటిలో మార్పులకు అవకాశం లేదు” అని పేర్కొంది. సోమవారం చెరువును సందర్శించిన సందర్భంగా ఇరిగేషన్ అధికారులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించారని గుర్తుచేసింది. చెరువు అభివృద్ధి పనులు శాస్త్రీయంగా, పారదర్శకంగా కొనసాగుతున్నాయని హైడ్రా వెల్లడించింది.

Tags: