ఆధ్యాత్మిక సంపదకు రామకృష్ణ పరమహంస ప్రతీక
విశ్వంభర, చిక్కడపల్లి: ఎందరో యోగులు, ఋషులకు జన్మభూమి అయిన భారతదేశం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక రామకృష్ణ పరమహంస అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ ఛైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. హైద్రాబాదు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో రామకృష్ణ పరమహంస స్మృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోలేటి దామోదర్ మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస కాళికా ఉపాసకుడిగా ఆధ్యాత్మిక సాధనలో విశిష్ట స్థానం సంపాదించారని చెప్పారు. మౌనమే తన సందేశంగా తీసుకుని, శిష్యులను సంస్కారవంతమైన జీవితాల వైపు దారి చూపిన మహనీయుడు రామకృష్ణ పరమహంస అని పేర్కొన్నారు. ఆయన శిష్యుడైన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారని అన్నారు. రామకృష్ణ పరమహంస పేరిట దేశ, విదేశాలలో స్థాపించబడిన రామకృష్ణ మఠాలు ధర్మప్రచారం, వ్యక్తిత్వ వికాసం, సమాజసేవకు ప్రతీకలుగా నిలుస్తూ పరమహంస బోధనలను అనుసరిస్తూ పనిచేస్తున్నాయని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆరాధన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకం కృష్ణయ్య, సంఘసేవకుడు భవాని ప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



