సంక్రాంతి తర్వాత ఆ ఐదుగురు మంత్రులు అవుట్..?
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి కీలక పథకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇక ముందున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అయితే, ప్రభుత్వ పనితీరుకు భిన్నంగా కొందరు మంత్రుల వ్యవహార శైలి కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఐదుగురు మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే ఢిల్లీకి చేరాయని, అవసరమైతే వారిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా జరుగుతోందని తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ రిపోర్టులతో ఢిల్లీకి సమాచారం:
ఈ ఐదుగురు మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఒక మహిళా అధికారితో ఆయన నడిపిన తీరు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కారణంగా ఇద్దరు మహిళా అధికారుల బదిలీలు జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక పార్టీలో అనుభవం ఉన్న మరో సీనియర్ మంత్రి విషయంలోనూ ఢిల్లీకి పూర్తి డేటా చేరినట్టు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాల్లో చాలా చురుగ్గా వ్యవహరించిన ఆయన, తాజా సమావేశాల్లో మాత్రం పూర్తిగా మౌనంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని బట్టి ఆయనపై కూడా చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో దక్షిణ తెలంగాణకు చెందిన మరో సీనియర్ మంత్రి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది.
ఎన్నికల ముందు చేరిన నేతలపై కూడా కన్ను:
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఓ మంత్రి వ్యవహార శైలిపై కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, ఉత్తర తెలంగాణకు చెందిన మరో మంత్రి హైదరాబాద్ కేంద్రంగా ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మహిళా అధికారులు, పార్టీ నేతలతో చేసిన వ్యాఖ్యలు, జోకులు వివాదాలకు దారి తీస్తున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.ఇక ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మహిళా మంత్రి కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఆమె చేసిన వ్యాఖ్యలు రేవంత్ సర్కార్‌కు ఇబ్బందికర పరిస్థితులను తీసుకువచ్చాయని, అందుకే ఆమెపై కూడా ఢిల్లీ అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం.
త్వరలో కీలక నిర్ణయాలా?
మొత్తంగా చూస్తే, ప్రభుత్వ పనితీరును మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంపై సమీక్షకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీకి నష్టం కలిగించే అంశాలను సహించబోమన్న సంకేతాలను ఢిల్లీ ఇప్పటికే పంపిందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.



