ఆకతాయిల పనిపట్టిన పోలీసులు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా త్రిబుల్ రైడింగ్ చేస్తూ, పదవ తరగతి పరీక్ష కేంద్రాల రోడ్డులో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న మైనర్లపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. త్రిబుల్ రైడింగ్ చేస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన మైనర్లను కానిస్టేబుల్ అప్సర్ ఖాన్ వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారిని ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం ఎదుట హాజరుపరచగా, వారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలు సురక్షితంగా ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు



