ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి : కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. టీ ప్రైడ్, తెలంగాణ ఐపాస్ వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయాలని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి పరిశ్రమల పెట్టుబడుల ప్రమోషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐపాస్ చట్టం, టీ ప్రైడ్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ ఐపాస్ చట్టం కింద వివిధ శాఖల నుండి అనుమతులు పొందేందుకు 30 యూనిట్లు ₹36.90 కోట్ల పెట్టుబడితో దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. అందులో 64 అనుమతులు ఇప్పటికే మంజూరు చేసినట్లు చెప్పారు. టీ ప్రైడ్ పథకం ద్వారా 2025 నవంబర్ 1 నుండి 2026 ఏప్రిల్ 7 వరకు కాలంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వాహనాల మంజూరు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ఎస్టీ వర్గానికి 42 యూనిట్లకు ₹1,34,18,564 సబ్సిడీ, ఎస్సీ వర్గానికి 1 యూనిట్‌కు ₹1,36,500 సబ్సిడీ మంజూరు చేసినట్లు చెప్పారు. అలాగే మొత్తం 43 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలకు కమిటీ అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ అన్ని వర్గాల యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, అట్టి అవకాశాలను యువతీ యువకులు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆమే సూచించారు, అందుకోసం సంబంధిత విభాగాల సిబ్బంది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు దేశీ రామ్ నాయక్, శ్రీనివాస్ రావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్, ఫ్యాక్టరీస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు, టౌన్ ప్లానింగ్ అధికారి తారక్ సాయి, సిబ్బంది ముకేష్ తదితరులు పాల్గొన్నారు.



