ఆరోగ్యమే మహాభాగ్యం
విశ్వంభర, కంబాలపల్లి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ఆరోగ్యం' అనే పదానికి 'వ్యాధి లేదా అంగ వైకల్యం లేకపోవడమే కాకుండా సంపూర్ణ శారీరక, మానసిక , సామాజిక స్వస్థతను కలిగి ఉండే స్థితి' గా నిర్వచించిందని పేర్కొన్నారు. ఇందులో కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే మనం ఆసక్తి చూపుతాం కాని మరో రెండు ముఖ్యాంశాలయిన మానసిక, సామాజిక స్థితులను గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. 2026 సంవత్సరానికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రత్యేక నేపథ్యం థీమ్ విజ్ఞానానికి అండగా నిలుద్దాం ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం అపోహలను, మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసం వీడి, శాస్త్రీయ, వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారానే ఆరోగ్యం సాధ్యమని ఆయన తెలిపారు. జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్ మాట్లాడుతూ , ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం ఎప్పటి నుంచో వింటున్నామని ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి వల్ల అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని పేర్కొంటూ ఆరోగ్య అలవాట్లు ఆచరించటం వారంలో 5రోజులు కనీసం 30నుండి 60నిముషాలు వ్యాయామం చేయటం, స్థానికంగా చౌకగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకొనుట, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించుట ఆహారం., నీరు, గాలి మనం కలుషితం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతూ ఈ విధంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉంటటం వల్ల.... మనం మన సమాజం లోని మనవాళ్ళు అందరికి ఆరోగ్యం చేకూర్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుధీర్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుబాయి, ఆరోగ్య విధ్యా బోధకులు కేవి రాజు, పురుషోత్తమ్, గీత, ఎంపిహెచ్‌ఈఓ నరేశ్, సూపర్ వైజర్ సక్రి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంధి తదితరులు పాల్గొన్నారు.



