మౌలిక సదుపాయాలు కల్పించాలి
విశ్వంభర, హైదరాబాదు : మూడు నెలల రేషన్‌ను ఒకే నెలలో పంపిణీ చేయడంతో నగరవ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా తరలివస్తున్న లబ్ధిదారులు ఎండదెబ్బకు గురవుతున్న నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరంగా మారింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని షామియానాలు ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడం అవసరమని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన రోడ్లపై ఉన్న రేషన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలకు తావివ్వకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పంపిణీ సమయంలో అవ్యవస్థలు తలెత్తకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అంబర్‌పేట డివిజన్ న్యూ పటేల్ నగర్‌లోని రేషన్ షాప్‌ను మాజీ కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.



