ప్రేమ పేరుతో వేధింపులు.. నిందితుడి అరెస్ట్
విశ్వంభర, సిద్దిపేట: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తూ సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఉపేందర్ మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్‌కు చెందిన బర్మా వెంకటేశ్ గతంలో ఓ బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదై వెంకటేశ్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. సదరు బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్నేహితులకు పంపడం ప్రారంభించాడు. గతంలో తనపై నమోదైన కేసులోని సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బర్మా వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ఉపేందర్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మహిళలు, మైనర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.



