జలమండలి అధికారులతో ఎమ్మెల్యే గాంధీ సమీక్ష
విశ్వంభర, హైదరాబాద్ : రాబోయే వర్షాకాలానికి ముందే డ్రైనేజి పైప్‌లైన్ ఔట్‌లెట్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే గాంధీ జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం వివేకానందనగర్ లోని ఆయన నివాసంలో జలమండలి అధికారులతో కలిసి పనుల స్థితిగతులను సమీక్షించారు. ఈ సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీలలో రూ. 9 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత డ్రైనేజి పైప్‌లైన్ ఔట్‌లెట్ నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే గాంధీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లగండ్ల, హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీలలో చేపడుతున్న డ్రైనేజి పైప్‌లైన్ ఔట్‌లెట్ పనులను రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నవోదయ కాలనీ, నల్లగండ్ల హుడా కాలనీ నుంచి ఎస్టీపీ అనుసంధానించే యుజిడి పైప్‌లైన్ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్‌తో కాలనీల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న డ్రైనేజి ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగిందని ఆయన పేర్కొన్నారు. నల్లగండ్ల హుడా కాలనీ వద్ద రూ. 28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్ టీ పీ ద్వారా కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు శుద్ధి చేయబడుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరం తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి రంగాల్లో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జలమండలి ప్రాజెక్ట్స్ విభాగం సిజిఎం పద్మజ, డిజిఎం భార్గవి, జలమండలి అధికారులు జీఎం కృష్ణ, డిజిఎం శ్రీహరి, మేనేజర్లు అరుణ్, లోకేష్, ఈశ్వర్, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు



