కార్పొరేషన్ లబ్దిదారులను గుర్తించాలి

కార్పొరేషన్ లబ్దిదారులను గుర్తించాలి

విశ్వంభర, సిద్దిపేట : ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుదారులను ఫీల్డ్ వెరీఫై చేసి అర్హులకు నిర్ధిష్ట సమయంలో రుణాలు అందజేయాలని ఎంపీడీవోలను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. పాలిచ్చే జంతువులు, సోలార్ యూనివర్సల్ యూనిట్లకు ప్రాధాన్యత సబ్సిడీ ఉన్నందునా ఏ ఒక్క యూనిట్ కూడా మిగలకుండా గ్రౌండింగ్ చేయించాలని చెప్పారు. మండల స్థాయిలో కమిటీ ఆమోదయోగ్యం చేశాక జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈలతో కలెక్టర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ,  ఎస్‌బీఎం గ్రామీణ్ పథకంలో భాగంగా గృహ నిర్మాణాల్లో ఉపాధి అవకాశం కోసం సెట్రింగ్, ఇటుకల తయారీ యూనిట్లకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీల శాతం తప్పనిసరిగా పెంచాలని ప్రతీ రోజు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మండలాల్లో నిర్వహించే సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో తప్పనిసరిగా మండల స్థాయి అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో జిల్లా ముందు వరుసలో ఉందని, గ్రౌండింగైన ప్రతీ ఇల్లు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. మార్కింగ్ ఇచ్చి ఇంటి పనులు మొదలుపెట్టని లబ్దిదారులతో గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి వారితో ఇల్లు మొదలు పెట్టించి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్ భార్గవ్, గృహ నిర్మాణశాఖ పీడీ పవన్ కుమార్ పాల్గొన్నారు.

Tags: