కలాల కవాతు పుస్తకావిష్కరణ

కలాల కవాతు పుస్తకావిష్కరణ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: గద్దర్ ఆలోచనలు, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఆయన జీవితం ప్రజల కోసం అంకితమైనదని గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొ. శాంతా సిన్హా అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక వేత్త సామ మల్లారెడ్డి రచించిన ‘కలాల కవాతు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. గద్దర్ జీవిత పోరాటం సామాజిక మార్పు కోసం సాగిందని, ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయని పేర్కొన్నారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనను పురస్కరించుకుని “పాటపై తూటా… ప్రశ్నించే గొంతులు… సాధించిన విజయాలు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రా. కాశీం మాట్లాడుతూ గద్దర్‌పై కాల్పులు ఎవరు జరిపారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, మరణాన్నికూడా లెక్కచేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలన్న ప్రయత్నాలను వ్యతిరేకించినందుకే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రొ. కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ,  రాజ్య హింస ఎంత తీవ్రమైనా ప్రజా చైతన్యం దానికంటే బలంగా ఉంటుందని అన్నారు. గద్దర్ ఒక తుఫానుగా పుట్టి సమాజంలో మార్పు కోసం తన పాటను ఆయుధంగా ఉపయోగించారని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. గద్దర్‌పై మరిన్ని పరిశోధనలు జరగాలని కోరారు. సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొ. కోదండరాం మాట్లాడుతూ రాజ్య హింసకు వ్యతిరేకంగా పాట, ఆట ద్వారా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ కన్వీనర్ జి. సూర్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రజాకవి సంజీవ్, జర్నలిస్టు తులసి చంద్, సామ మల్లారెడ్డి, సుల్తాన్ యాదగిరి , రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags: