పల్లెవెలుగు బస్సును పునరుద్దరించాలి

పల్లెవెలుగు బస్సును పునరుద్దరించాలి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రం నుండి రామన్నపేట - అమ్మనబోలు రూట్లో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించి ప్రజలు, విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ఆర్టిసి అధికారులను కోరారు. నల్లగొండ రీజినల్ మేనేజర్ జానీరెడ్డికి ఆర్ఎం కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా నిత్యం ఆర్టీసీ బస్సు సేవలు అందించి అనేక మందికి ప్రయాణానికి అనుకూలంగా ఉన్న బస్సు గత రెండు సంవత్సరాలు నుండి నడవకపోవడంతో విద్యార్థులు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దుబ్బాక, మునిపంపుల పల్లివాడ, ఎన్నారం, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల ప్రజలు నిత్యం అనేక అవసరాలు రీత్యా రామన్నపేట మండల కేంద్రానికి వస్తుంటారు, సుమారుగా 500 మంది విద్యార్థులు మండల కేంద్రంలో ఇతర ప్రాంతాల్లో విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. కనీసం బస్సు సౌకర్యం లేక ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి రోజుకు వంద రూపాయలు ఆర్థిక భారం మోయలేక అనేకమంది విద్యార్థులు చదువు బందు చేసి విద్యకు దూరమవుతున్నారు. భద్రత కరువై ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారుగా తొమ్మిది గ్రామాలకు కనీసం పల్లె వెలుగు బస్సు రాకపోవడం అభివృద్ధికి తిరోగమనమని సమస్యను గుర్తించి వెంటనే రామన్నపేట-అమ్మనబోలు రూట్లో పల్లెవెలుగు బస్సును పునరుద్దరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు గంటెపాక శ్రీను, మాజీ వార్డు సభ్యులు బూడిద బిక్షం, సంజీవ, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, శ్రీకృష్ణ, నకిరేకంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: