తూకంలో తక్కువ బియ్యం
- ప్రజావాణిలో పోరండ్ల గ్రామస్తుల ఫిర్యాదు
విశ్వంభర, కరీంనగర్ : తూకంలో తక్కువ బియ్యం… రికార్డుల్లో పూర్తి పంపిణీ అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని రేషన్ దుకాణం నం. 2047325లో డీలర్ అవకతవకలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్థులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యం తక్కువగా ఇచ్చి, రికార్డుల్లో మాత్రం పూర్తి పరిమాణం పంపిణీ చేసినట్లు తప్పుడు ఎంట్రీలు నమోదు చేస్తున్నారని వివరించారు. పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా అదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇది పేదల హక్కులను బహిరంగంగా ఉల్లంఘించే చర్యగా, తీవ్రమైన దోపిడీ, మోసం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ రద్దు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ పార్నంది, కొండ్ర సురేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.



