అవినీతిమయంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక
విశ్వంభర, అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రూరల్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో చేస్తున్న మంజూరు అవినీతిమయంగా మారిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అధికారికంగా జరగడంలేదని ఆయన అన్నారు.పార్టీ కార్యాలయాలు వేదికగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరగడం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. నిరుపేదలు ఇల్లు లేక గ్రామాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార పార్టీ నాయకులనే ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనర్హులకు ఇండ్ల మంజూరు విషయంలో గ్రామ కార్యదర్శులను వివరణ కోరగా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు మంజూరు చేయాలని,జిల్లా అధికారులు హుకుం జారీ చేశారని చెబుతున్నారు.ఇట్టి విషయంపై జిల్లా అధికారులు సమాధానం చెప్పకుండా దాటి వేస్తున్నారని ఆయన ఆగ్రహించారు.ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా కలెక్టర్కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు అవుతున్న ఇందిరమ్మ అర్హులను ఎంపిక చెయ్యకపోతే బిజెపి పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుందని హెచ్చరించారు.



