బస్సులు సమయపాలన పాటించాలి 

బస్సులు సమయపాలన పాటించాలి 

  • ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్

విశ్వంభర, హైదరాబాదు : బస్సులు నిర్దేశించిన బస్టాప్‌లలో ఆగకపోవడం, షెడ్యూల్ సమయాలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైవర్ల అజాగ్రత్త డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తోందని ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాదులోని ఆర్టీసీ భవన్‌లో ఎండీని కలిసిన ప్రతినిధులు పలు సమస్యలను వివరించారు. బస్సుల్లో సరైన తలుపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఫుట్‌బోర్డ్ ప్రయాణం పెరిగి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పండుగ రోజుల్లో చార్జీల పెంపు ప్రజలకు భారంగా మారుతోందని పేర్కొన్నారు. అలాగే బస్సుల్లో అగ్ని భద్రతా పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ సదుపాయాలను పెంచాలని కోరారు. పెద్దలు, పిల్లల భద్రత దృష్ట్యా బస్సులు నిర్దేశిత బస్టాప్‌లలోనే ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. సాయి ప్రసాద్ రావు మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏ. సాయి ప్రసాద్ రావు, జనరల్ సెక్రటరీ ఎస్. వెంకట్ నరసింహ రెడ్డి, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు శరత్ చంద్ర, కోఆర్డినేటర్ ఏ. సాయి వెంకట్ రావు, మాజీ సభ్యురాలు శుభా అరోరా తదితరులు పాల్గొన్నారు.

Tags: