విప్లవాత్మక మార్పుకు నాంది.. రైతే విద్యుత్ అమ్మకందారు: భట్టి విక్రమార్క

విప్లవాత్మక మార్పుకు నాంది.. రైతే విద్యుత్ అమ్మకందారు: భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ ఇకపై విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారనున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ ఇకపై విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారనున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో 'సోలార్ మోడల్ విలేజ్' కార్యక్రమాన్ని భట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రావినూతల గ్రామంలోని ఒక ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు అని అభివర్ణించారు.

ప్రజలపై ఎలాంటి భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో ఇళ్లపై, పంపు సెట్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వినియోగదారులు తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించవచ్చని పేర్కొన్నారు. దీని కోసం యూనిట్‌కు రూ.2.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్క రావినూతల గ్రామానికే రూ.24 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Read More జాగృతి జనం బాటలో భాగంగా కృష్ణవేణి   టాలెంట్ స్కూల్  సందర్శన

సామాన్యుడికి లాభం
ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాది మొత్తం మీద సుమారు రూ.14,000 వరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. మిగిలిన విద్యుత్ (కనీసం 1,086 యూనిట్లు) విక్రయించడం ద్వారా ఏడాదికి రూ.4వేల నుంచి 5 వేల వరకు నగదు లభిస్తుందని పేర్కొన్నారు. ఏడు నెలల వ్యవసాయ అవసరాల తర్వాత మిగిలిన సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రైతులకు అదనపు ఆదాయాన్ని ఇస్తుందని తెలిపారు. ''ఇప్పటివరకు ప్రజలే విద్యుత్ సంస్థలకు డబ్బులు కట్టారు. కానీ ఇకపై విద్యుత్ సంస్థలే ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయి. మహిళలు ఈ ఆదాయాన్ని పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు వాడుకొని ఆర్థికంగా బలపడాలి.'' అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

కాలుష్య రహిత భవిష్యత్తు వైపు..
సోలార్ విద్యుత్ వల్ల కేవలం ఆర్థిక లాభాలే కాకుండా, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు. వరి వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.